Mukesh Ambani : ఆర్బీఐ ఆంక్షలతో సంక్షోభంలో ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనుగోలు చేయవచ్చనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురించగా, పేటీఎం ఈ వార్తలను ఖండించింది. అయితే, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు మాత్రం భారీగా పెరిగాయి. సోమవారం ట్రేడింగ్‌లో జియో షేర్లు 16.25% పెరిగి ₹295 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని నమోదు చేశాయి.
ఫైనాన్షియల్ మార్కెట్లో విస్తరణ
ఫైనాన్షియల్ మార్కెట్లో విస్తరించాలని చూస్తున్న జియో, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను కొనుగోలు చేయడం ద్వారా తన లక్ష్యాలను చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జియో ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి ప్రవేశించింది. జియో ఫైనాన్స్ లిమిటెడ్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, జియో పేమెంట్ సొల్యూషన్స్, జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను కూడా జియో నిర్వహిస్తోంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారం
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రస్తుతం డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లు, బిల్ పేమెంట్ సర్వీసెస్‌లను అందిస్తోంది. డెబిట్ కార్డులు, జియో వాయిస్ బాక్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ బ్యాంక్ వ్యాపారం జియోతో జతకూడితే, ఈ రంగంలో జియోకు మరింత విస్తరించే అవకాశం దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పేటీఎం CEO హామీ
మరోవైపు, పేటీఎం CEO విజయ్ శేఖర్ శర్మ, ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడతామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగులతో ఆయన వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావడం లేదని తెలిపిన ఆయన, పరిస్థితుల నుండి బయటపడేందుకు ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.