moral stories in telugu : ఒక అడవిలోని చెట్టు మీద ఒక పిచ్చుకల జంట నివసించేది. ఒకరోజు, ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్ళికి వెళ్ళి తిరిగివస్తూ ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. వారు పెళ్ళిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకున్నారు, ముఖ్యంగా పాయసం ఎంత రుచికరంగా ఉందో చెప్పుకున్నారు.
ఆ పిచ్చుకలకు పాయసం చాలా ఇష్టం. మగ పిచ్చుక ఆడ పిచ్చుకతో, “నాకు కూడా పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా?” అని అడిగింది.
ఆడ పిచ్చుక, “సరే, బజారుకి వెళ్లి బియ్యం, పంచదార, పాలు తీసుకురా” అని అంది.
మగ పిచ్చుక అన్నీ తెచ్చాక, ఆడ పిచ్చుక పాయసం చేయడం మొదలు పెట్టింది. పొయ్యం మీద గిన్నె పెట్టి నీళ్ళు, బియ్యం పోసి ఉడకపెట్టింది. బియ్యం ఉడకడానికి కొంత సమయం పడుతుంది. కానీ, మగ పిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువైంది. “పాయసం తయారయిందా?” అని అడిగింది.
“ఇంకా బియ్యం ఉడకలేదు” అని ఆడ పిచ్చుక చెప్పింది.
కొంతసేపటి తర్వాత మళ్ళీ, “ఇంకా అవలేదా?” అని మగ పిచ్చుక అడిగింది.
“ఇప్పుడే పంచదార, పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి” అని ఆడ పిచ్చుక చెప్పింది.
చివరికి, పాయసం తయారైంది. అడవంతా పాయసం వాసనతో ఘుమఘుమలాడింది.
“పాయసం అయ్యిందా?” అని మగ పిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడ పిచ్చుక, “అయ్యింది. కానీ…” అని మాట పూర్తి చేయకముందే, వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగ పిచ్చుక. ఆ కోపానికి పాయసం అంతా పడేసింది.
“అయ్యింది. కానీ… చల్లారాలి అని నేను మాట పూర్తి చేయక ముందే తినబోయి ఎంత పని చేసావు!” అని ఆడ పిచ్చుక అరిచింది.
గిన్నెలో మిగిలిన ఒక చుక్క పాయసాన్ని చల్లారకుండా రుచి చూసిన మగ పిచ్చుక, “అంత రుచిగా ఉంది!” అని అనుకుంది. తన తొందరపాటు వల్ల ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసుకున్నందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడటం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది.
నీతి: ఓపికగా ఉండటం మంచిది. తొందరపడితే పొరపాట్లు జరుగుతాయి.