Maharashtra Road Accident : జూలై 1వ తేదీ శనివారం తెల్లవారుజామున మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడుస్తున్న బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనమయ్యారు. యావత్ మాల్ నుంచి పూణె వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు వెళ్తుండగా, బుల్దానా వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో బస్సులోని 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో మంటలు వ్యాపించడంతో కొంతమంది బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బుల్దానా సివిల్ ఆసుపత్రికి తరలించారు. బస్సు వేగంగా వెళ్తుండగా పేలుడు సంభవించి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.
బుల్దానా ఎస్పీ సునీల్ కడాసనే తెలిపిన వివరాల ప్రకారం
బస్సు ప్రమాదానికి గురైనప్పుడు బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 25 మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడ్డారు.
విదర్భ ట్రావెల్స్‌కు చెందిన MH29 BE 1819 బస్సు నాగ్‌పూర్ నుండి పుణెకి సమృద్ధి హైవేపై వెళ్తోంది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బుల్దానీ సమీపంలోని సింధ్‌ఖేడ్ రాజా వద్ద బస్సు టైరు పగిలి స్తంభాన్ని ఢీకొని చిన్న వంతెనను ఢీకొని బోల్తా కొట్టిందని చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో బస్సు డీజిల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. మంటల్లో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి తప్పించుకున్నారని కడసానే తెలిపారు.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు ప్రమాదంపై నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ప్రయాణికులు బుల్దానా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
మంటల్లో కాలిపోతున్న తోటి ప్రయాణికుల అరుపులు విన్నామని, అయితే ఆ సమయంలో ఏమీ చేయలేకపోయామని బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న ఓ ప్రయాణికుడు తెలిపాడు.
ఆ ప్రయాణికుడు ఇంకా ఏం చెప్పాడు?
“ఛత్రపతి శంభాజీనగర్‌లో దిగాలి. నా స్టాప్ గంటలో ఉంటుంది కాబట్టి దిగేందుకు సిద్ధమవుతున్నాను. ఇంతలో బస్సు బోల్తా పడింది. నేనూ, నా స్నేహితుడూ కిందపడ్డాం. కాసేపటికి ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి అద్దాలు పగలగొట్టి బయటికి దూకాడు. మేము కూడా అతనితో పాటే దూకేసాము.
మా వెంటే మరికొందరు బస్సు నుండి దూకారు . బస్సు బోల్తా పడిన వెంటనే మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం కాలిపోయింది. ప్రయాణికుల కేకలు వినిపించాయి. కానీ మేమేమీ చేయలేకపోయాం’ అని ప్రమాదం నుంచి బయటపడ్డ ఆ ప్రయాణికుడు తెలిపారు.
బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. మంటల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
read more :
horoscope today in telugu : 01-07-2023 ఈ రోజు రాశి ఫలాలు
Goddess Rukmini : రుక్మిణీ దేవి ఎవరు ? హిందూ పురాణాలలో ఆమె ప్రాముఖ్యత ఏమిటి?