Tirupati: ఏపీలోని తిరుపతిలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గోవిందరాజస్వామి చిన్న శేష వాహనంపై భక్తులను కరుణించారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తుల భజనలు, కోలాటంతో స్వామిని కీర్తించారు.
మంగళవాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనలు, స్వామివారి వాహనసేవ అత్యద్భుతంగా జరిగింది. చిన్న శేష వాహనంపై గోవిందరాజ స్వామి పాంచభౌతిక ప్రకృతికి సంకేతమని వేద పండితులు పేర్కొన్నారు.
ఇక ఐదు తలల చిన్నశేషుని దర్శనం మహాయోగప్రదమని పండితులు చెబుతున్నారు. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తులతో ఏర్పడే పరిణామాలు తొలగిపోతాయని, భక్తులకు కుండలినీయోగం సిద్ధిస్తుందని ప్రతీతి.
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో జనం స్వామిని దర్శించుకోవడానికి తరలి వచ్చారు.
దేవదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. ఎండ తాపం కారణంగా భక్తులు ఉక్కపోతతో ఉడికిపోయారు. దేవస్థానం ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం కల్పించడంతో నీరు తాగుతూ కాస్త ఉపశమనం పొందారు.
Read Also : Devotional: సనాతన ధర్మం ప్రకారం నిత్య పూజ ఎలా చేసుకోవాలి?