Goddess Lakshmi: లక్ష్మీదేవి అమ్మవారిని 8 రూపాలుగా పూజలు నిర్వహిస్తారని చాలా మందికి తెలిసిన విషయమే. అయితే, ఆ రూపాలు, వాటి వెనకున్న విశిష్టత గురించి కూడా తెలుసుకోవాలి. అష్టలక్ష్మీ రూపాల్లో మొదటిది ఆదిలక్ష్మి. ఈ రూపంలో ఉన్న అమ్మవారికి మహాలక్ష్మీ అని కూడా పిలుస్తారు. నాలుగు చేతులతో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. ఒక చేతిలో పద్మం, మరో చేతిలో పతాకం ధరించి అమ్మవారు కనిపిస్తారు. అలాగే మరో రెండు చేతుల్లో అభయ వరద ముద్రలు అమ్మవారు కలిగి ఉంటారు. పాల కడలిపై నారాయణుడి వద్ద ఉండే తల్లి ఈమె అని ప్రతీతి. లోకాలను కాచే అమ్మ ఆదిలక్ష్మీ. ప్రాణ శక్తికి, ఆరోగ్యానికి అధిష్టాన దేవత.
ఇక రెండో రూపం ధాన్యలక్ష్మి. పంటలు సమృద్ధిగా పండే ధాన్యం రాశులుగా మారి అందరి జీవితాలను సుభిక్షంగా ఉంచేది ధాన్యలక్ష్మి. ఆహారానికి ప్రతీకగా ధాన్యలక్ష్మి అమ్మవారికి కొలుస్తారు. ఆకుపచ్చని రంగులో, ఎనిమిది చేతులతో దర్శనమిస్తారు. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల, రెండు చేతులు వరదాభయ ముద్రలతో భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తారు. శారీరక దారుఢ్యాన్ని ప్రసాదించేతల్లిగా ధాన్యలక్ష్మిని ఆరాధిస్తారు.
ఇక మూడో రూపం ధైర్యలక్ష్మి. సంపదలు ఉన్నా లేకపోయినా ధైర్యం ఉంటే అన్నీ సమకూరుతాయని నానుడి. ధైర్యలక్ష్మి తోడుంటే జీవితంలో అపజయం అనేదే ఉండదని పెద్దలు చెబుతారు. ఈమెనే ‘వీరలక్ష్మి’ అని కూడా అంటారు. ఎర్రని వస్త్రాలు ధరించి..8 చేతుల్లో చక్రం, శంఖం, ధనుర్బాణం, త్రిశూలం, పుస్తకం, వరదాభయ ముద్రలలో దర్శనమిస్తుంది.
నాలుగో రూపం గజలక్ష్మి. సంపదకు తగిన హుందాతనాన్నీ ప్రతిష్టనూ అందించే తల్లి గజలక్ష్మి. ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీర సాగరమథనంలో గజలక్ష్మి వెలికి తెచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. సకల శుభాలకు అధిష్టాన దేవత ఈమె. ఇక ఐదో రూపం సంతాన లక్ష్మి. పిల్లలు లేని వారి ఒడినింపే తల్లి సంతానలక్ష్మి. ఆరో రూపం విజయలక్ష్మి. సకల కార్యసిధ్దికి సర్వత్రా విజయసిద్దికి అధిష్టాన దేవత విజయలక్ష్మి.
ఇక ఏడో రూపం విద్యాలక్ష్మి. జీవితం పరిపూర్ణం కావాలంటే భక్తితత్వంతోపాటు లౌకిక జ్ఞానం తప్పనిసరి. వీటిని అందించే తల్లి విద్యాలక్ష్మి. సరస్వతీదేవికి ప్రతిరూపంగా కూడా భావిస్తారు. అందుకే తెల్లని వస్త్రాలు ధరించి పద్మపు సింహాసనంలో ఆసీనురాలై ఉంటుంది. విద్య, వివేకాన్ని అందించే దేవత విద్యాలక్ష్మి. ఇక ఆఖరిది, ఎనిమిదో రూపం ధనలక్ష్మి. సంపదని ప్రసాదించి దారిద్య్రాన్ని దూరం చేసే దేవత ధనలక్ష్మీ. ఇందుకు చిహ్నంగా ఆమె చేతిలో బంగారు నాణేలున్న కలశం ఉంటాయి.
Read Also : Devotional: సనాతన ధర్మం ప్రకారం నిత్య పూజ ఎలా చేసుకోవాలి?