Amaravati: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి రాజధాని అమరావతిలో భారీ సభ నిర్వహించనున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంలో భాగంగా రేపు ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ ఏర్పడింది. ఓవైపు అమరావతిని రక్షించాలంటూ అక్కడి రైతులు కొందరు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూనే ఉన్నారు. మరోవైపు మూడు రాజధానులకు మద్దతుగా మరో శిబిరం కొనసాగుతోంది. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి అమరావతి రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో అమరావతిలో ఇతరులకు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారని అక్కడి రైతులు కొందరు ప్రశ్నిస్తున్నారు. స్థానికేతరులకు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అమరావతి అభివృద్దిని పక్కనబెట్టి, భూములిచ్చిన రైతులను ఆదుకోవడం మరచిన సీఎం జగన్‌కు.. పేదల పేరు ఎత్తే అర్హత లేదని మండిపడుతున్నారు. నిన్న తుళ్లూరు, మందడం, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించిన ప్రభుత్వం.. మహిళలు, రైతులను అడ్డుకుంది. నిరసనలు తెలిపేందుకు అంగీకరించలేదు. ఇళ్ల పట్టాల పంపిణీ ఏర్పాట్లను మహిళా రైతులు, నిరసన కారులు అడ్డుకోవాలని ప్రయత్నించడంతో ఈ ఉద్రిక్తత నెలకొంది.
అయితే, రైతుల ముసుగులో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బినామీలతో ఉద్యమం చేయిస్తోందని ప్రభుత్వ పెద్దలు మండిపడుతున్నారు. కోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబుకు, టీడీపీ నేతలకు బుద్ధి రాలేదని, పేదలకు మేలు జరుగుతుంటే ఓర్వలేకపోతున్నారని మంత్రులు మండిపడుతున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించినా పేదల కోసం మహా యజ్ఞాన్ని జగన్ చేస్తున్నారని, దీన్ని ఆపలేరంటూ మంత్రులు హెచ్చరిస్తున్నారు.
రేపు సీఎం జగన్ అమరావతిలో 51,392 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో ఇప్పటికే 25 లేఅవుట్లు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా చక్కదిద్ది నీట్‌గా తయారు చేశారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో నిరుపేదలకు స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇదే వేదికపై 5,204 టిడ్కో ఇళ్లు కూడా సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి ఈ సభలో ఏం ప్రసంగిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రైతుల నిరసనపై కూడా స్పందిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.
Read Also : YS Jagan : 175 సీట్లలో పోటీ చేసే దమ్ముందా? చంద్రబాబు, పవన్‌కు జగన్ సవాల్..!