Bypolls: దేశ వ్యాప్తంగా అందరి చూపూ ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ఓటమి, కర్ణాటక భారీ మెజార్టీతో విజయం సాధించడంపై ప్రముఖులంతా స్పందిస్తున్నారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ శ్రేణులను కూడా ఆయన ఓదార్చారు. కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
ఇదిలా ఉంటే.. కర్ణాటక ఎన్నికల ఫలితాలో పాటు దేశ వ్యాప్తంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళ ప్రకటించారు. అయితే.. ఈ ఫలితాల్లోనూ కమలం పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోవడం గమనార్హం. అందరూ కర్ణాటకలోనే కమలం పార్టీ ఓటమి చవిచూసిందని చెప్పుకుంటున్న తరుణంలో ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం పెద్దగా లేదని తేలడంతో బీజేపీ శ్రేణులను మరింత కలవరపాటుకు గురి చేస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండటంతో దేశ వ్యాప్తంగా బీజేపీ జోరు తగ్గితే మళ్లీ ఎన్డీఏ సర్కార్ రావడం కష్టమేనని సగటు బీజేపీ అభిమాని ఆలోచనలో పడ్డాడు. ఇక పంజాబ్ లోని జలంధర్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ ఎంపీ సంతోష్ సింగ్ మరణంతో జలంధర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కాస్తా ఆప్ వశం చేసుకుంది.
మరోవైపు ఒడిశాలోని జార్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేడీ (బిజూ జనతాదళ్) విజయకేతనం ఎగురవేసింది. బీజేడీ అభ్యర్థి దీపాలీ దాస్ గెలుపొందారు. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని బిజూ జనతాదళ్ నిలబెట్టుకోవడం విశేషం. ఇక, ఉత్తరప్రదేశ్లో సువార్, ఛన్బే అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. రెండు చోట్లా అప్నాదళ్ (సోనేలాల్)నే విక్టరీ సాధించింది.
అప్నాదళ్.. అక్కడ అధికార బీజేపీకి భాగస్వామిగా ఉంది. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజామ్ ఖాన్ తనయుడు అబ్దుల్లా అజామ్ ఖాన్ కు కోర్టు 15 ఏళ్ల నాటి కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో సువార్ లో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఛన్బే నియోజకవర్గంలో రింకీ కోలే విజయం సాధించారు.
Read Also : Calcutta High Court: కలకత్తాలో కలకలం.. 36 వేల మంది టీచర్లను తొలగించాలన్న హైకోర్టు