Pawan Kalyan: పొత్తులపై జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని పవన్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్.. కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి అధికారం లాక్కోవాలని, దాన్ని ప్రజలకు అప్పగించాలనేదే తమ లక్ష్యమన్నారు. కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటామన్న పవన్.. ఢిల్లీలోనూ ఈ అంశంపై చర్చించినట్లు వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే తమ బలం గణనీయంగా పెరిగిందని పవన్ చెప్పుకొచ్చారు.
జనసేన పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల్లో 30 శాతం ఓటింగ్ ఉందని పవన్ తెలిపారు. పట్టున్న స్థానాల్లో కచ్చితంగా జనసేన పోటీ చేస్తుందని పవన్ పేర్కొన్నారు. తమ బలాన్ని బట్టే సీట్లు అడుగుతామని పవన్ తెలిపారు. ముఖ్యమంత్రి పదవి అనేది షరతులు పెట్టి పొందలేమంటూ పవన్ చెప్పారు. తనకు సీఎం పదవి కట్టబెట్టాలని బీజేపీనో, తెలుగుదేశం పార్టీనో అడిగేది లేదని చెప్పారు. ప్రజలు కోరుకుంటే తాను సీఎం అవుతానన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి 30 నుంచి 40 సీట్లు వచ్చి ఉంటే కర్ణాటకలో కుమారస్వామిలా వ్యవహరించేవాడినన్నారు.
ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని అంటున్నారని, అందుకే జూన్ మూడో తేదీ నుంచి ఏపీలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు పవన్ ప్రకటించారు. పొత్తుల విషయంలో తన స్టాండ్‌లో మార్పు లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు కూడా పొత్తులతోనే బలాన్ని పొందాయని పవన్ చెప్పారు. పొత్తులు కచ్చితంగా ఉంటాయని, ఎవరైనా ఒప్పుకోకపోతే ఒప్పించి తీరుతామన్నారు.
పొత్తులకు సీఎం అభ్యర్థి ప్రామాణికం కాదని పవన్ కల్యాణ్ వెల్లడించారు. లెఫ్ట్ , రైట్ పార్టీలతో కలిసి వైసీపీపై పోరాడాలని తనకు ఉందన్నారు. అయితే, లెఫ్ట్ పార్టీలు తనతో కలిసిరావని పవన్ వ్యాఖ్యానించారు. పొత్తులు అంటే ఓ కులానికి సంబంధించినవి కావన్న పవన్.. బలమైన పార్టీలు కలిసి నడవాలని పిలుపునిచ్చారు. మొత్తానికి పవన్ కల్యాణ్ 2014 సీన్ రిపీట్ చేయాలని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, బీజేపీ జాతీయ అధిష్టానం టీడీపీతో కలిసేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది.
Read Also : Ustaad Bhagat Singh:ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ విడుదల.. ఈ సారి థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..!