అమెరికా అధ్యక్షుడిగా తనకు మరోసారి అవకాశం కల్పించాలని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కోరారు. అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసేందుకు తనను మరోసారి అధ్యక్షుడిగా చేయాలన్నారు. 80 ఏళ్ల బైడెన్.. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు అదికారికంగా ప్రకటన చేశారు.
మంగళవారం ఓ మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియో విడుదల చేసిన బైడెన్.. అందులో ఎన్నికల ప్రచారానికి అధికారికంగా శ్రీకారం చుట్టినట్లు ప్రకటించారు. దీంతో అమెరికాలో మరోసారి అధక్ష్య ఎన్నికల హడావుడి ఇప్పటి నుంచే మొదలైనట్లు అయ్యింది.
మరోవైపు భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడామరోసారి తన రన్నింగ్ మేట్‌గా ఉంటారని బైడెన్ చెప్పారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన బైడెన్.. యూఎస్ చరిత్రలో అత్యంత ఎక్కువ వయసు కలిగిన అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారు.
కమలా హారిస్ అమెరికా మొట్ట మొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై రికార్డులు సృష్టించారు. ఇక ఇప్పటికే బైడెన్‌పై ఓటమిని చవిచూసిన మాజీ అధ్యక్షుడు ట్రంప్.. వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడు బైడెన్ అని ట్రంప్ ధ్వజమెత్తారు. ప్రపంచ వేదికలపై దేశ పరువును మంటగలుపుతున్నాడని, బైడెన్ చేతగానితనంతో అమెరికాను మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలిపారంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బైడెన్ అధికారికంగా ప్రకటన చేసే ముందుగా ట్రంప్ మీడియాతో ముచ్చటించారు. అఫ్గానిస్తాన్ నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకోవడాన్ని యూఎస్ చరిత్రలోనే అత్యంత సిగ్గు చేటైన విషయమని పేర్కొన్నారు. మరోవైపు 2024 ఎన్నికలను రిపబ్లికన్ల అతివాదంపై పోరుగా జో బైడెన్ అభివర్ణించారు.
వచ్చే ఎన్నికల్లో తమ ప్రధానాంశాలను బైడెన్ వివరించారు. అబార్షన్ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక భద్రత చట్రం వంటివి తమ ప్రాధాన్య అంశాలుగా చెప్పారు. గత అధ్యక్ష ఎన్నికలు అమెరికా ఆత్మను పరిరక్షించేందుకు జరిగాయని, అది ఇంకా కొనసాగుతోందన్నారు.
ఇక ట్రంప్ వాదన మరోలా ఉంది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత కీలక సమయంగా ట్రంప్ పేర్కొన్నారు. ప్రజల హక్కులు హరిస్తున్నారని, గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. రిపబ్లికన్ల తరఫున ట్రంప్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE