Karnataka assembly elections : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం నేతల వైఖరి భిన్నంగా ఉంటోంది. ఎన్నికల్లో పార్టీ తరఫున టికెట్ రాకపోతే సిద్ధాంతాలు, విశ్వాసాలను పక్కన పెట్టేస్తున్నారు.
మనకు టికెట్ రాకపోతే నిర్మొహమాటంగా పార్టీ మారిపోదాం అనుకొనే నేతలు పెరిగారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలుగా ఉంటున్న వారి ఆలోచనలు కూడా ఇలాగే ఉంటున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయింపుల్లో అసమ్మతితో ఉన్న సీనియన్ నేతలు.. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్నికలు వస్తున్నాయంటే వలసలు సాధారణమే. అయితే, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ లాంటి నేతలు కూడా పార్టీలు మారడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది సంచలనాలకు నాంది పలకడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రయోగాలకు పూనుకున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది కొత్త వారికి టికెట్లు దక్కాయి. ఫలితంగా వలసలు అధికమయ్యాయి. అయితే, వలసలు, కొత్త వారికి టికెట్లు ఇవ్వడం వల్ల రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ముఖ్య నేతలుగా ఉన్న వారు పార్టీలు మారడంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లలో ఓటు బ్యాంకు చీలే ప్రమాదం ఉందని నేతలు భయపడుతున్నారు. తమకు టికెట్లు దక్కలేదనే బాధతో నేతలు నియోజకవర్గాల్లో ఓట్లను చీల్చే అవకాశం ఉందని అధిష్టానం గుబులు పడుతోందట.
ఈ క్రమంలో పార్టీపై అసమ్మతితో ఉన్న నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీలో అసమ్మతి నేతలు ఎక్కువగా ఉన్నారట. బీజేపీలో లింగాయతులకు తీవ్ర అన్యాయం జరిగిందని జగదీశ్ శెట్టర్ ఆరోపించడంతో అలాంటిదేమీ లేదని సభా వేదికలపైనే బీజేపీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నేతల వలసలతో జేడీఎస్ అధికంగా లాభపడితే కాంగ్రెస్‌కు పెద్దగా నష్టం లేదని చెబుతున్నారు. ప్రభావితం చేయగల నేతలు పార్టీ మారితే ఎంత మేర ఓట్లు చీలుతాయనే లెక్కలు వేయడంలో ముఖ్య నేతలు బిజీగా ఉన్నారట.
బీజేపీ నుంచి పార్టీ మారిన నేతల్లో జగదీశ్ శెట్టర్, లక్ష్మణసవది, పుట్టణ్ణ, బాబూరావ్ చించినసూర్, వీఎస్.పాటిల్, యుబీ.బణకార్, ఎన్‌వై.గోపాలకృష్ణ ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ లో చేరారు.
బీఎస్.యడియూరప్ప అనుచరుడు ఎన్‌ఆర్.సంతోష్ జేడీఎస్ పార్టీలోకి వెళ్లారు. ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎస్‌ఆర్.శ్రీనివాస్, కేఎం.శివలింగేగౌడ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా చాలా మంది పార్టీ మారిన వారు ఉన్నారు.
ALSO READ :
BRS Aurangabad : మహారాష్ట్రలో మరోసారి బీఆర్ఎస్ బహిరంగ సభ.. కేసీఆర్ టార్గెట్ అదేనా?
Ajinkya Rahane : టెస్టులకు కూడా పనికిరాడన్నారు.. ఇప్పుడు సిక్సర్ల సునామీ సృష్టిస్తున్నాడు!