Andhra Pradesh News : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తాజాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పర్యటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి చంద్రబాబును అడ్డుకున్నారు. జీవో నంబర్ 1 ప్రకారం ఇరుకు రోడ్లు, ఇరుకు సందుల్లో, ప్రమాదకర ప్రాంతాల్లో రోడ్ షోలు, ర్యాలీలు నిషిద్ధమని పేర్కొంటూ చంద్రబాబును పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.
పోలీసులకు సహకరించేది లేదని, అనపర్తి నుంచే సహాయనిరాకరణ మొదలు పెట్టానని చంద్రబాబు ప్రకటించారు. సైకో పాలనలో పోలీసులు కూడా సైకోలుగా మారారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలని పిలుపునిచ్చారు. ఒకవైపు లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటున్నారని, తన పర్యటనలనూ అడ్డుకోవడం సబబు కాదని సీఎం జగన్‌కు హితవు పలికారు. తాను అధికారంలో ఉండగా తలచుకొని ఉంటే నువ్వు రోడ్డుపై తిరగగలిగేవాడివా అని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు చంద్రబాబు.
తానేమైనా పాకిస్తాన్ నుంచి వచ్చానా? వేరే దేశానికి పారిపోతున్నానా? తననెందుకు అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో అవమానాలను భరించి ఇక్కడికి వచ్చానని, జగ్గంపేట, పెద్దాపురంలో సహకరించిన పోలీసులు.. అనపర్తిలో ఎందుకు అడ్డుచెప్పారంటూ పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల అడ్డంకులు, ఆంక్షలు ఛేదించుకొని కాలినడకన ఆయన అనపర్తికి చేరుకోవడం గమనార్హం. అనంతరం అనపర్తి బహిరంగ సభలోప్రసంగించారు.
పోలీసులకు భయపడి తాను వెనక్కి వెళ్లిపోతే మిమ్మల్ని బతకనిస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు. సైకో సీఎం పోలీసుల మెడపై కత్తిపెట్టి ఇలాంటి పనులు చేయిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు సంఘ విద్రోహుల్లా మారారని ఆరోపించారు. ఇదే యూనిఫాంలో రేపు తన దగ్గర పని చేయాల్సి ఉంటుంది.. గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చరించారు. ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను వ్యతిరేకించి అనపర్తి మార్చ్ చేయాల్సి వచ్చిందన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో చంద్రబాబు అనపర్తిలోని రామవరంలోనే రాత్రి బస చేశారు.
also read :
Health Benefits of Eating Cloves : లవంగాలు తినడం వల్ల లాభాలు ఇవే..
Chiranjeevi: రామ్ చరణ్‌ని ఆకాశానికి ఎత్తేసిన జేమ్స్ కామెరూన్.. ఫుల్ ఖుష్ అయిన చిరు