దాయాది దేశం పాకిస్తాన్లో సంక్షోభం (Pakistan Crisis) రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఓవైపు ఆహార సంక్షోభం, మరోవైపు ఆర్థిక సంక్షోభం.. అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఆహార నిల్వలు ఖాళీ అయిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇలా ఉండగా, సంక్షోభంపై తాజాగా పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి ఇషాఖ్ దార్ తాజాగా సంక్షోభంపై భిన్నంగా స్పందించారు.
తాజాగా రైల్వే లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన మంత్రి దార్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ను అల్లానే సృష్టించాడని, దేశాన్ని ఆయనే బాగు చేస్తాడని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉండి కూడా చేయలేని దద్దమ్మలా మాట్లాడుతున్నారంటూ నెటిజన్లు కూడా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
అల్లానే కనుక పాక్‌ను సృష్టించి ఉంటే ఆయనే కాపాడతాడంటూ మంత్రి దార్ వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం పేరిట ఈ గడ్డను అల్లా సృష్టించాడని చెప్పారు. అందువల్ల దేశాన్ని సుభిక్షంగా మార్చే బాధ్యత కూడా ఆయనదేనంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్న దార్.. మళ్లీ అభివృద్ధి దిశగా దేశం దూసుకెళ్తుందన్న నమ్మకం ఉందన్నారు.
ప్రధానమంత్రి షెహ్బాజ్ ఆధ్వర్యంలోని పీఎంఎల్-ఎన్ ప్రభుత్వం దేశంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోందన్నారు. అయితే, దేశంలో ప్రస్తుత పరిస్థితులకు గత ఇమ్రాన్ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నిత్యం తీవ్రంగా శ్రమిస్తున్నా కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అయితే, పాక్మంత్రిపై దేశంలోని మేధావులు, ప్రజలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజల కష్టాలను తీర్చకుండా దద్దమ్మలా దేవుడిపైనే భారం వేశామని మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొంటున్నారు
also read :
Himanshu rao : ఓక్రిడ్జ్ స్కూల్లో కాస్నివాల్ వేడుక.. కేసీఆర్ మనవడు హిమాన్షు నాయకత్వం..
RGV : పవన్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటంటూ వర్మ ట్వీట్లు
Tarakaratna: విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. ఆ వ్యాధి అంత ప్రమాదకరమా ?