ట్విట్టర్, యూట్యూబ్‌లకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తయారు చేసిన ఓ డాక్యుమెంటరీపై వివాదం చెలరేగింది. ఇది మనదేశ ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీ కావడం ఇందుకు కారణమైంది. ఈ డాక్యుమెంటరీ రెండు భాగాలుగా రూపొందించారని, తొలిభాగం ఇప్పటికే ప్రసారమైనట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఇండియాలో ప్రసారం కాలేదు.
బీబీసీ ప్రసారం చేసిన మోదీకి సంబంధించిన డాక్యుమెంటరీలో పలు వివాదాస్పద అంశాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ట్విట్టర్ లింకులు తక్షణమే తొలగించాలని ఆయా సంస్థలకు కేంద్ర హోం, విదేశాంగ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటికే 50 ట్వీట్లను బ్లాక్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
బీబీసీ ప్రసారం చేసిన ఈ డాక్యుమెంటరీ ప్రజలను తప్పుదోవ పట్టించేటట్లు ఉందని కేంద్రం స్పష్టం చేసింది. మనదేశ సుప్రీంకోర్టు అధికారం, క్రెడిబులిటీలపై దాడి చేసే ప్రయత్నమని కేంద్రం నిర్ధారించింది. దేశ సార్వభౌమాధికారం, అఖండత, సమగ్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. సమాచార సాంకేతిక నియమాల ప్రకారం యూట్యూబ్, ట్విట్టర్ సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది.
వలసవాద ధోరణిని ప్రోత్సహించేలా ఉంది..
బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ మొదటి భాగం మంగళవారం ప్రసారమైంది. రెండో భాగాన్ని ఈనెల 24న ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది పక్కా ప్రాపగాండా పీస్ అంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మండిపడింది. వలసవాద ధోరణి ఇందులో కనిపిస్తోందని కేంద్రం మండిపడింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, ట్విట్టర్ లింకుల ద్వారా అప్‌లోడ్ అయ్యిందని, వెంటనే వాటిని తొలగించాలని కేంద్రం ఆదేశించింది.
also read:
Rishi Sunak : బ్రిటన్ భద్రంగా ఉండాలంటే రిషి నాయకత్వమే ఉండాలి.. ప్రజల విశ్వాసం చూరగొన్న రిషి!