జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (pawan kalyan) పై వైసీపీ యువనేత, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి (Byreddy Siddartha Reddy) ప్రశ్నల వర్షం కురిపించారు. శ్రీకాకుళంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన యువశక్తి సభలో పవన్ కల్యాణ్‌తో పాటు జబర్దస్త్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న హైపర్ ఆది మాటలపై ఓ టీవీ చానల్‌తో మాట్లాడిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వారిద్దరిపై పలు ప్రశ్నలు సంధించారు. ఎవరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తరఫున మాట్లాడటం కామన్ అని బైరెడ్డి చెప్పారు.
హైపర్ ఆది జనసేనలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ గురించి చెప్పుకోవడం సహజమేనన్న బైరెడ్డి.. ఏదో విమర్శించాలి కాబట్టి హైపర్ ఆది పలు విమర్శలు చేసిఉంటాడని చెప్పారు. మంత్రులు వారి శాఖల గురించి పట్టుమని పది నిమిషాలు కూడా మాట్లాడలేరంటూ హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలపై సిద్ధార్థరెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్‌కు ఏపీలో ఉండే 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా? అని ప్రశ్నించారు. కనీసం కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల పేర్లు చెప్పగలుగుతారా? అని ప్రశ్నించారు.
హైపర్ ఆదిగానీ, ఇంకొకరుగానీ తాము ఎలాంటి నాయకత్వం కింద పని చేస్తున్నామన్నది గమనించుకోవాలన్నారు. జగన్ నాయకత్వంలో పని చేసినందుకు ఇవాళ 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, 30 మంది ఎంపీలుగా అయ్యేందుకు అవకాశం లభించిదన్నారు. ఇంకా ఎమ్మెల్సీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లుగా అయ్యారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు లక్షలాది మందికి సంక్షేమం అందుతోందని చెప్పారు. జగన్ నాయకత్వంలో తమకు గౌరవం దక్కిందని బైరెడ్డి తెలిపారు.
ప్రభుత్వాలే తలకిందులవుతాయి..
పవన్‌ను నమ్ముకొని పని చేసినందుకు కొందరు అప్పులపాలైపోయారని బైరెడ్డి చెప్పారు. రేపు ఎన్నికల్లో చంద్రబాబు కోసం జనసైనికులు పని చేయాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితి తమకు ఏనాడూ రాదని బైరెడ్డి స్పష్టం చేశారు. ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ వైఎస్ జగన్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని బైరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రులు కూడా బీఆర్‌ఎస్‌తో వచ్చి పొడిచేస్తామంటూ వ్యాఖ్యానిస్తున్నారని, కానీ వైఎస్ జగన్ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే అక్కడున్న ప్రభుత్వాలే తలకిందులవుతాయని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
also read:
Kalyan Ram: బుల్లితెరపై కూడా రికార్డ్ బద్దలు గొట్టిన బింబిసార.. కళ్యాణ్ రామ్ రేంజ్ మారిందా..!