AP BRS : తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్.. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా రూపాంతంరం చెందింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇందులో భాగంగా మొదటగా పక్క రాష్ట్రం ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఏపీ నుంచి బీఆర్ఎస్లో ఇప్పటికే పలువురు నాయకులు చేరారు.
ప్రగతి భవన్‌కు వచ్చిన ఏపీ నేతలు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, కాపు నేత తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ మాజీ అధికారి పార్థసారధి తదితరులు మందీమార్బలంతో వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి సాదర స్వాగతం పలికారు. ఇక ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తమ ఉనికి చాటుకోవాలని బీఆర్ఎస్ తాపత్రయపడుతోంది. జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం 6 శాతం ఓటింగ్ సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆ లక్ష్యాన్ని చేరుకొనేదుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.
పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ఉన్న కేసీఆర్.. ఏపీపై దృష్టి సారించారు. ప్రధానంగా అక్కడ కాపు సామాజికవర్గ ఓట్లు కీలకంగా మారిన నేపథ్యంలో వారి ఓట్లను పొందేందుకు కార్యాచరణ చేస్తున్నారు. కాపు నేతలు, ప్రధాన పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ద్వితీయశ్రేణి నేతలను బీఆర్ఎస్లో చేర్చుకొని ఓటర్లను ప్రభావితం చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఇలా అభ్యర్థులను నిలబెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
పొత్తులపై చివరి నిమిషంలోనూ మార్పులు..
తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలతో సఖ్యతగా మెలుగుతోంది. అటు ఏపీలో అయితే సీపీఐ.. బీజేపీతో పాటు జనసేనతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. సీపీఎం మద్దతు ఎవరికి ఉంటుందనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్తో ఏపీలో కమ్యూనిస్టులు కలుస్తారా? లేదా అనేది ఎన్నికల సమయం వరకు వేచి చూడాల్సిందే. ఏపీలో ప్రస్తుతం ఒంటరిగా పోటీ చేసేందుకే బీఆర్ఎస్ మొగ్గు చూపుతోందని సమాచారం. ఉత్తరాంధ్రలో కాపులు, కేసీఆర్ సామాజిక వర్గమైన వెలమల ఓట్లను బీఆర్ఎస్కు దక్కేలా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తే ఏపీలో ఎలాంటి వైఖరి అవలంబిస్తారనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
also read:
Viral video : మహిళా కార్యకర్తను తదేకంగా చూస్తున్న సిద్ధరామయ్య.. వీడియో వైరల్
BRS : ఖమ్మం సభకు మూడు రాష్ట్రాల సీఎంలు.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ డిక్లరేషన్ ప్రకటిస్తారా?
NTR: జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసిన టీమిండియా క్రికెటర్స్.. పిక్ అదిరిపోలా..!