జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలపై ఇటీవల ఫోకస్ పెంచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం పెంచారు. ఇందులో భాగంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. అయితే, తాజాగా శ్రీకాకుళం వేదికగా నిర్వహించిన యువశక్తి సభలో పవన్ ప్రసంగం వెనుక చాలా పెద్ద ప్లానే ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని పవన్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. తర్వాత చంద్రబాబును కలిసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమనే సంకేతాలు ఇచ్చినట్లయింది.
అయితే, అధికారికంగా పొత్తులపై స్పందించకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తమకు కనీసం 50కిపైగా సీట్లు కేటాయించేలా పవన్ గౌరవప్రదమైన స్థానాల పేరిట చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాట చెబుతున్నారు. గతంలో 2019 ఎన్నికల సందర్భంగా టీడీపీతో వేరుపడి పవన్ ఒంటరిగా పోటీ చేశారు. ఈ సమయంలో సుమారు 53 సీట్లలో వైసీపీ గెలిచేందుకు పరోక్షంగా సహకరించినట్లయిందని జనసేన నేతలు లెక్కలు వేస్తున్నారు.
ఆయా సీట్లలో టీడీపీ ఓట్లు చీలిపోయి వైసీపీకి పడ్డాయని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈసారి పొత్తులో భాగంగా కనీసం 50 సీట్లు జనసేనకు కేటాయించడం ద్వారా రాబోయే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఏకంగా 50 సీట్లు జనసేనకు కేటాయించడం సాధ్యమయ్యేపని కాదని టీడీపీ నేతలు అంటున్నారు.
ఆత్మగౌరవం వెనుక అసలు ఉద్దేశం ఇదేనా?
శ్రీకాకుళం సభ సందర్భంగా మాట్లాడిన పవన్.. ఆత్మగౌరవం ఉండేలా, గౌరవప్రదంగా సీట్ల కేటాయింపు, సర్దుబాట్లు ఉంటేనే పొత్తు కొనసాగించగలమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, ఈ క్రమంలో తాము కనీసం 40కిపైగా స్థానాలు సునాయాసంగా గెలుచుకుంటామని జనసేన భావిస్తోంది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు జనసేనకు అసలు అభ్యర్థులే లేని తెలుగు తమ్ముళ్లు లెక్కలు వేస్తున్నారు. పవన్, నాదెండ్ల మనోహర్ తప్ప పెద్ద నాయకుడు ఒక్కరైనా ఉన్నారా? అని టీడీపీ క్యాడర్ చర్చించుకుంటోంది. ఈ క్రమంలో పొత్తు పొడిచి, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చేలోపు జగన్ ముందస్తుకు వెళ్లిపోయి వీరిని ఓవర్‌టేక్ చేస్తాడంటూ అటు వైసీపీ క్యాడర్ గుసగుసలాడుకుంటోంది.
also read:
బొన్నీ గాబ్రియేల్ : మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న అమెరికా అందగత్తె
Santro Ravi : సాంట్రో రవి ఎవరు ? ఇతను చేసిన నేరాలేంటి? ఇప్పుడెందుకు హాట్ టాపిక్ గా మారాడు?