ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు (ChandraBabu Naidu) ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా పర్యటిస్తూ సభలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై నిప్పులు చెరుగుతున్నారు. నిస్తేజంగా ఉన్న టీడీపీ క్యాడర్లో జోష్ నింపేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కందుకూరులో బహిరంగ సభ నిర్వహించారు. వేలాది మంది టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. ఈ క్రమంలో కాస్త ఇరుకు సందు కావడంతో ప్రమాదం జరిగింది.
అక్కడే ఉన్న మురికి కాలువలో పడి ఏకంగా 8 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో టీడీపీ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఉన్నారు. దీనిపై ఏపీలో రాజకీయ దుమారం రేగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా వినాశనమే ఎదురవుతోందని అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం తమ అధినేత పర్యటనలో పోలీసు ప్రొటెక్షన్ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కందుకూరు ఘటన మరువక ముందే నిన్న మళ్లీ అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. గుంటూరులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. అనంతరం టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుకలు పంచే కార్యక్రమం జరుగుతుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఇలా చంద్రబాబు పాల్గొంటున్న సభల్లో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడం రాష్ట్ర ప్రజలను నివ్వెరపోయేలా చేస్తోంది.
ఎవరు బాధ్యులు?
చంద్రబాబు సభల్లో వరుస ప్రమాదాలపై రాజకీయం జోరుగా సాగుతోంది. ప్రజలు చనిపోతుంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అధికార పార్టీ ఆరోపించినట్లుగా చంద్రబాబు సభలకు జనం రాకపోయినా తక్కువ మందితోనే డ్రోన్ షూట్ల కోసం ఇరుకు సందుల్లో ప్లాన్ చేశారా? లేదా ప్రతిపక్షం ఆరోపించినట్లుగా అధికార పార్టీ పట్టించుకోకుండా, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా? మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? కేవలం నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే బాధిత కుటుంబాలకు పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా? ఇది ప్రతిపక్షం, అధికార పార్టీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
also read :
Pawan Kalyan: ఇది కదా పవన్ మేనియా.. రీరిలీజ్ని కూడా ఇంతగా ఆదరిస్తారా…!