Moral Stories in Telugu : అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవిలో పెద్ద చెట్టు. గుబురుగా ఆకులుండి వత్తుగా ఉండటంతో ఓకాకి అక్కడ తనకో గూడు కట్టుకుంది. ఎక్కడెక్కడి నుంచో రోజూ గడ్డిపరకలు తెచ్చు కోడానికి బాగా శ్రమపడేది, గూడు సిద్ధమయ్యాక అప్పుడు గుడ్లు పెట్టింది.
ఇదంతా ఒక కోకిల గమనిస్తూనే ఉంది. తను కూడా గుడ్లు పెట్టి పిల్లలను కనాలనుకుంది. అప్పుడు దాని తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
“గుడ్లు పెట్టటం వరకే నీవంతు. పొదగటం వంటి పిచ్చి పనులు మీద వేసుకోకు. చక్కగా కాకి గూట్లో నీ గుడ్లను పెట్టు. అది పొదిగితే నీ పిల్లలు తయారు అవుతాయి. మా అమ్మ నాకు ఇదే చెప్పింది.మా అమ్మకు వాళ్ళ అమ్మ కూడా ఇదే చెప్పిందట. అర్థమయిందా?” అని తనకు తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని అలాగే చెయ్యాలనుకొంది. అలాగే చేసింది కూడా !
కానీ కాకి గుడ్లు పిల్లలయ్యాయి కానీ కోకిల గుడ్లు అలాగే ఉండిపోయాయి. ఏరోజుకారోజు కాకి బయటకు వెళ్ళగానే గూడు దగ్గరకు వెళ్ళటం, చూసుకోవటం కోకిలకు దినచర్యగా తయారయింది. కాకి పిల్లలు పెద్దవై గూటిలోంచి ఎగిరిపోయాయి.
అప్పటిదాకా ఎలాగో అడగకుండా ఆపుకున్న కోకిల తన అనుమానాన్ని కాకి దగ్గర వెళ్ళకక్కింది.
అప్పుడు కాకి “నువ్వడిగినప్పుడే చెబుదామనుకొని ఆగాను. మోసం కలకాలం సాగేది కాదు. ఎప్పుడో ఒకప్పుడు బయటపడి పోతుంది. మీ మోసాన్ని అందరూ చెప్పుకుంటూ ఉండటంతో గ్రహించాను.
పరోపకారం చెయ్యటంలో తప్పులేదు కానీ బద్దకస్తులను పెంచకూడదనుకున్నాను. బద్దకం అన్నిటికన్నా పెద్ద జబ్బు. ఆ జబ్బును వదలగొట్టడం నా చేతుల్లోనే ఉందనుకున్నాను. అందుకే నేను గడ్డిపరకలు తెచ్చుకోవటానికి వెళ్ళే చోట ఓ స్కూలు ఉంటే అక్కడ నుంచీ రంగు సీమ సున్నపు ముక్కలు తెచ్చిదాచుకున్నాను.
నేను గూడ్లు పెట్టగానే దాని మీద సీమసున్నంతో గుర్తుపెట్టుకొని వాటినే పొదిగాను. నిజంగా నువ్వు గుడ్లను పిల్లలు చేసుకోలేకపోతే సహాయపడే దాన్నే. కానీ అతి తెలివితో ఎన్నో తరాలుగా ఇలా గుడ్లను మా గూటిలో పెట్టి పిల్లలుగా తయారు చేయటం నాకు తప్పనిపించింది. అదే సమయంలో నీకు సరైన గుణపాఠం చెప్పాలనిపించింది” అంది కాకి.
అలా కాకి చెప్పగానే కోకిల సిగ్గుతో తల దించుకుంది.
నీతి : ఎప్పుడూ బద్దకాన్ని దగ్గరకు రానివ్వకూడదు. శ్రమను నమ్ముకోవాలి.
also read news:
Kidney Stones : కిడ్నీలో రాళ్లు.. ఎలా తెలుసుకోవాలి? సంకేతాలివే..! ఆలస్యం చేయకండి..!