Bihar Bridge Collapse : సాధారణంగా నేషనల్ హైవేలపై కట్టే వంతెనలు చాలా బలంగా నిర్మిస్తుంటారు. వందేళ్లు దాటినా దృఢంగా ఉండేలా బ్రిడ్జిలు నిర్మించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లపై ఉంటుంది. అలాంటిది నాసిరకంగా నిర్మిస్తే.. ఇంకేముందీ.. మధ్యలోనే కుప్పకూలిపోతుంటాయి. కాంట్రాక్టర్ బాగానే ఉంటాడు.. కానీ ప్రాణనష్టం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇలాంటి ఘటనే ఇప్పుడు బిహార్‌లో చోటు చేసుకుంది. అయితే, అదృష్టవశాత్తూ ఇంకా ప్రారంభించకముందే బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ప్రయాణాలు జరుగుతున్నప్పుడు కూలిపోయి ఉంటే పదుల సంఖ్యలో ప్రాణనష్టం చవిచూడాల్సి వచ్చేది.
బిహార్ రాష్ట్రంలోని బెగూసరాయ్‌లో బుఢీ గండక్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభానికి ముందే కుప్పకూలడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆదివారం ఈ వంతెన కూలిపోయింది. 206 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం సుమారు 13.43 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. గోవింద్‌పూర్, రాజౌరా వెళ్లే సాహెబ్‌పూర్ కమల్ బ్లాక్‌లోని బుఢీ గండక్ నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. దీనికి విష్ణుపూర్ అహోక్ ఘాట్ వంతెనగా నామకరణం చేశారు.
ఈ బ్రిడ్జిని 2017లోనే పూర్తి చేశారు. అయితే, దీనికి యాక్సిస్ రోడ్డు లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. ఈ వంతెనను మా భగవతి నిర్మాణ సంస్థ చేపట్టింది. అయితే, ఈ కాంట్రాక్టర్ సొమ్ము చేసుకోవడంపై పెట్టిన శ్రద్ధ.. నిర్మాణంపై చూపలేదని స్థానికులు అంటున్నారు. పనులు పూర్తయి కొన్నాళ్లు కూడా గడవకముందే బ్రిడ్జి ముందు భాగంలో పగుళ్లను గుర్తించారు.
కాంట్రాక్టర్‌ను అరెస్టు చేయాలి..
తాజాగా ఈ బ్రిడ్జి వ్యవహారంపై ఉన్నతాధికారులకు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది. అయితే, ఈలోపే డిసెంబర్ 18న బ్రిడ్జి కుప్పకూలింది. బ్రిడ్జి నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిపై బిహార్‌లో ప్రతిపక్షాలు నితీష్ సర్కార్‌పై మండిపడుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంలో భారీ అవినీతి చోటు చేసుకుందని, ప్రారంభానికి ముందే కూలిపోవడం దీనికి నిదర్శనమని లోక్ జనశక్తి పార్టీ నేత సంజయ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కూలిన ఈ బ్రిడ్జి వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
also read news:
చలికాలంలో పచ్చి బఠానీ లు తింటే అనారోగ్య సమస్యలు దూరం..