RRR అంటే సినిమా అనుకున్నారా? కాదండోయ్ రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి, రాజ్ శెట్టి. ఈ శెట్టి సమూహం ప్రస్తుతానికి తమ వైవిధ్యమైన సినిమాలతో ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఒకప్పుడు కన్నడ సినిమా పరిధి చాలా చిన్నది. అయితే OTTల రాకతో బాషాభేదం లేకుండా అన్ని సినిమాలను వీక్షించే ప్రేక్షకులు పెరగడంతో ప్రతిభ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడటం మొదలుపెట్టారు. అలా కేజీఎఫ్ సినిమాతో దేశాన్ని తనవైపుకు తిప్పుకున్న కన్నడ పరిశ్రమ మేము మిగిలిన పరిశ్రమలకన్నా ఏం తీసిపోము అంటూ ప్రత్యేకమైన సినిమాలను ప్రేక్షకులకు అందించడం మొదలుపెట్టింది.
రిషబ్ శెట్టి (Rishab shetty)
ఇప్పుడు దేశమంతటా విజయఢంకా మోగిస్తున్న ‘కాంతారా’ (Kantara) సినిమాకు ముందే ‘గరుడ గమన వృషభ వాహన’ (Garuda Gamana Vrishabha Vahana) సినిమాతో దక్షిణాది ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు రిషబ్ శెట్టి. రిషబ్ కేవలం నటుడే కాదు దర్శకుడు, రైటర్ కూడా. ‘కాంతారా’ సినిమా అతని దర్శకత్వంలో రూపొందిందే. మరో ప్రత్యేకమైన సినిమా ‘హీరో’లో కూడా రిషబ్ నటించాడు.
రాజ్ బి శెట్టి(Raj Shetty)
ఇటువంటి ప్రతిభే కలిగిన మరో శెట్టి రాజ్ బి శెట్టి. రాజ్ ‘గరుడ గమన వృషభ వాహన’ లో ముఖ్య పాత్ర పోషించి ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. ఇతను కూడా రిషబ్ లాగే దర్శకుడు మరియు రైటర్. రాజ్ మరో చిత్రం ‘ఒందు ముట్టాయే కథ’ (Ondu Motteya Kathe) కూడా ప్రశంసలు అందుకుంది. ఇటీవల హిట్ అయిన ‘777చార్లీ’ (777 charlie) సినిమాకు రాజ్ డైలాగ్స్ రాశారు.
రక్షిత్ శెట్టి (Rakshit shetty)
రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ‘కిరిక్ పార్టీ’ (Kirik Party) సినిమా నుండి అతను తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. ఈ సినిమా దర్శకుడు రిషబ్ శెట్టి కావడం విశేషం. ఆ సినిమా తర్వాత రిషబ్ శెట్టి సినిమాలపై కన్నడ ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఆపైన రక్షిత్ శెట్టి ‘అవనే శ్రీమన్నారాయణ’ (Avane Srimannarayana) వంటి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడుగా మారిపోయాడు. ‘777చార్లీ’ తో ఉత్తరాది ప్రేక్షకులను మైమరపించాడు.
ఈ RRR సమూహం ఇప్పుడు కన్నడనాట మాత్రమే కాదు దేశం మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. వీరి తర్వాతి ప్రోజెక్టుల గురించి ఆసక్తిగా మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్నారు.