2023 Israel–Hamas war : ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం ఉదయం ముగిసింది. ఒప్పందం పొడిగింపుపై ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సంధి ముగిసినట్లు తెలుస్తోంది. దీంతో గాజాలో మళ్లీ దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్, ఇతర జాతీయుల విడుదల కోసం గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఖతార్, ఈజిప్ట్ వంటి దేశాల దౌత్య ప్రయత్నాలతో ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
ఇజ్రాయెల్ మొదట నాలుగు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించింది. నవంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం.. ఆ తర్వాత మరో రెండు సార్లు పొడిగించింది.
వారం రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతుండగా, శుక్రవారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగిసింది. ఈ సమయంలో, హమాస్ 100 మందికి పైగా బందీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్ తన జైళ్ల నుండి 240 మందికి పైగా పాలస్తీనియన్లను విడుదల చేసింది. వారంతా స్త్రీలు, పిల్లలు.
వాస్తవానికి ఈ ఒప్పందాన్ని మరికొద్ది రోజులు పొడిగించే అవకాశం ఉందని ప్రాథమికంగా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇజ్రాయెల్ గానీ, హమాస్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. ఒప్పందం సమయంలో గాజా నుంచి తమపై రాకెట్లు ప్రయోగించారని పేర్కొంది.
సంధి ముగిసిన తర్వాత, ఇజ్రాయెల్ గాజాపై తన దాడులను తిరిగి ప్రారంభించింది. ఉత్తర గాజాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం బాంబు పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయని పలు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
మరోవైపు గురువారం ఉదయం జెరూసలెంలో ఉగ్రదాడి జరిగింది. జెరూసలేంలోని వీజ్‌మన్ స్ట్రీట్ బస్టాప్‌లో నిలబడిన వ్యక్తులపై ఇద్దరు పాలస్తీనా ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి.
also read :
Escalating Israel-Hamas Conflict: Top 10 Updates and International Response