Telugu Flash News

RBI On Rs.2000 Notes: రెండువేల రూపాయల నోటుపై సంచలన నిర్ణయం.. ఉపసంహరించుకున్న ఆర్బీఐ

RBI On Rs.2000 Notes: ఆర్బీఐ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ చేసింది. దేశంలో రెండువేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. 2016 నవంబర్ 8 అర్ధరాత్రి పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజల సౌకర్యార్థం రూ.2000, రూ.500 నోటు తీసుకొచ్చింది కేంద్రం. అయితే, ప్రస్తుతం రూ.2000 నోటు వల్ల బ్లాక్ మనీ పెరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్బీఐ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

రూ.2000 నోటును చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ పేర్కొంది. దేశంలోని 19 ప్రాంతీయ ఆర్బీఐ శాఖల్లో వాటిని మార్చుకునేందుకు అనుమతించింది. బ్యాంకులు సైతం రూ.2000 నోట్లను చలామణీలో పెట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సెప్టెంబర్‌ 30వ తేదీలోగా రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించింది. రోజుకు ఒక్కొక్కరికి రూ.20 వేల విలువైన నోట్లు మాత్రమే మార్చుకొనేందుకు వీలు కల్పించింది. ఈ నెల 23 నుంచి రూ.2000 నోటు మార్చుకోవడానికి చాన్స్ ఉంటుంది.

ఇక 2018లోనే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆర్బీఐ ఆపేసింది. ఆ సమయం నుంచి రెండు వేల నోట్లను సైతం రద్దు చేస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అంతా అనుకున్నట్లుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.2 వేల నోట్లను వెనక్కి తీసేసుకోవడం గమనార్హం. ఈ నోట్లు ఇకపై చెలామణీలో ఉండవని తెలిపింది. ఈ నిర్ణయంతో సామాన్యులపై ఏ ప్రభావం ఉండబోదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

కేవలం రూ.2 వేల నోట్లతో ట్రాన్జాక్షన్స్‌ జరిపే వాళ్లు, రియల్ ఎస్టేట్, బడా వ్యాపారాలు చేసే వారికే కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెబుతున్నారు. డిపాజిట్ సైతం చేసుకునే వీలు కల్పించింది ఆర్బీఐ. క్లీన్ నోట్ పాలసీ కింద రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ రీజనల్ బ్రాంచీలలో ఈ నోట్లను మార్చుకొనే వీలుంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కొరతతో ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 24(1) ప్రకారం దేశవ్యాప్తంగా రూ.2000 నోట్లను 2016లో నవంబర్లో తీసుకొచ్చారు.

Read Also : YS Avinash Reddy: అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణపై హైడ్రామా.. రోజంతా ఏం జరిగిందంటే..

Exit mobile version